Naveennayakofficial

ఈ దేశంలో మిగిలిన మూడు యెస్టేట్స్ మాదిరిగానే నాలుగో యెస్టేట్ అయిన మీడియా కూడా కులతత్వపు బురదలో కూరుకుపోయి వుందని చెప్పడానికి మన దగ్గర చాలా వుదాహరణలున్నాయి. 2016 లో జరిగిన వొక సర్వే ప్రకారం మీడియా రంగంలో నిర్ణయాలు తీసుకునే 315 మందిలో ఒక్క షెడ్యూలు కులాలకు, తెగలకు చెందిన వ్యక్తి లేకపోవడం మీడియాలో దళితుల వాటా యేమిటో చెప్పకనే చెబుతుంది. 2016 లో అంబేడ్కర్ బౌద్ధ ధర్మ దీక్ష తీసుకుని అరవై ఏళ్లు అయిన సందర్భంగా నాగపూర్ దీక్షా భూమి దగ్గర దాదాపు ఐదు లక్షల మంది హాజరై పెద్ద యెత్తున బౌద్ధ సమ్మేళనం జరిగితే దాన్ని మీడియా బొత్తిగా పట్టించుకోలేదు. సోషల్ మీడియా ద్వారానే యీ విషయం బయటికి వచ్చింది. వెనక్కెళితే యిటువంటి ఘనకార్యాలు పెత్తందారీ కులాల చేతిలో వూరేగే మీడియా యెన్నో చేసినట్టు తెలుస్తుంది. 1968 లో దళిత యువకుడైన కోటేసును కృష్ణా జిల్లా కంచికచెర్ల లో అక్కడి కమ్మ కులస్తులు దారుణంగా సజీవ దహనం చేసినప్పుడు ఆ దారుణాన్ని వొకవైపు బీ.బీ.సీ ఖండిస్తే, లోకల్ కమ్మ మీడియా ‘ మరి రాగి చెంబు కాజెస్తే చంపక ముద్దు పెట్టుకుంటారా!’ అనే ధోరణిలో రాయడం యీ దేశంలోని మీడియా కులతత్వానికి మచ్చు తునక. SUBSCRIBE AND SHARE