పెద్దపులి నక్క ఎలుగుబంటి కథ || Greedy Fox and Tiger Bear forest funny stories | Telugu moral stories
Автор: Storytime-Telugu
Загружено: 2021-03-05
Просмотров: 177526
*********** పెద్దపులి-నక్క-ఎలుగుబంటి కథ. *************
ఒక అడవిలో నక్క-ఎలుగుబంటి చాలా స్నేహంగా ఉండేవి. నక్కకు ఆహారం దొరక్కపోయినా ఎలుగుబంటిది మంచి మనసు కావడంతో, తనకి దొరికిన ఆహారంలో తన మిత్రుడుకూ కొంచెం పెట్టేది. అలా రెండూ ఎప్పుడూ అన్యోన్యంగా ఉండేవి.
ఒకనాడు నక్క, ఎలుగుబంటి కలసి ఆహారం కోసం అడవిలో తిరుగుతూ ఉండగా, ఆకలితో ఉన్న పెద్దపులి ఒకటి వీటికి ఎదురైంది. పరిస్థితిని గమనించిన ఎలుగుబంటి, నక్కతో "మిత్రమా.. ఆ పెద్దపులి మనవైపే వస్తోంది. దానికి చిక్కామంటే అంతే సంగతులు.. నువ్వు నా వీపును కరచుకో.. నేను ఈ పెద్ద చెట్టును ఎక్కేస్తాను.." అన్నది. అప్పటికే భయంతో వణుకుతున్న నక్క ఎలుగుబంటి మాటలు వినగానే వేగంగా దాని వీపును పట్టుకుంది. ఎలుగుబంటి చకచకా చెట్టు ఎక్కేసింది. చెట్టుపైన కొమ్మల్లో ఎలుగుబంటి-నక్క కదలకుండా ఉన్నాయి. చెట్టుక్రిందికి చేరిన పెద్దపులి వాటివైపే చూస్తూ అక్కడే కూర్చున్నది. ఎలుగుబంటి-నక్క చెట్టు దిగనూలేదు, పులి ఎంతకీ పక్కకు కదలనూలేదు. అలా చాలా సమయం గడిచిపోయింది.
చీకటిపడ్డాక ఎలుగుబంటి, నక్కతో ఇలా అన్నది. " మిత్రమా.... ఆ పులి పంతం కొద్దీ ఇక్కడే కూర్చున్నది. ఇంత పెద్ద చెట్టును అది ఎక్కలేదు. అయినా ఈ రాత్రంతా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనలో ఒకరు నిద్రిస్తే, ఇంకొకరు కాపలాగా మేలుకొని ఉండాలి."
" సరే మిత్రమా.." అన్నది నక్క.
అప్పుడు ఎలుగుబంటి " వయసు పైబడ్డ దానివి, ముందు నువ్వు నిద్రపో. అర్ధరాత్రి దాటాక నిన్ను నిద్ర లేపి, ఆపైన నేను నిద్రపోతాను. నువ్వు కాపలా కాద్దువు" అని నక్కతో అన్నది. నక్క సరేనని గాఢంగా నిద్రపోయింది. ఎలుగుబంటి కాపలా కాస్తూ కూర్చున్నది.
చెట్టుక్రిందనే వీటికోసం ఆశగా ఎదురు చూస్తూ కూర్చున్న పెద్దపులి కొంతసేపు అయ్యాక ఎలుగుబంటితో ఇలా అంది.
"ఓ ఎలుగుబంటి మిత్రమా.. నువ్వు ఆ నక్కకి కాపరివని నాకు తెలుసు. అయినా నా మాట విను, నువ్వు గానీ ఆ నక్కను కిందకి తోసేశావంటే, నేను దాన్ని తినేసి వేరే అడవికి వెళ్ళి పోతాను. నీకు ఆపద తప్పుతుంది.. ఆ ముసలినక్కకు ఆహారం తెచ్చిపెట్టే బరువూ తగ్గుతుంది."
"పులిరాజా.. ఈ నక్క నాకు ఎంత మాత్రమూ భారం కాదు. నేను తినే ఆహారంలో కొంచెం మాత్రమే దీనికి ఇస్తున్నాను. ఇది నన్నే నమ్ముకుని బ్రతుకుతోంది. నామీద నమ్మకంతో అది ఎంత హాయిగా నిద్రపోతోందో చూడు. నేను దీన్ని మోసం చేయటం మహా పాపం." అంటూ జవాబిచ్చింది ఎలుగుబంటి.
అంతలోనే అర్దరాత్రి దాటింది. ఎలుగుబంటి నక్కను నిద్రలేపి, తాను పడుకున్నది.
కొంతసేపటికి, ఎలుగుబంటి నిద్రపోయిందని నిర్ధారించుకున్నాక, చెట్టు క్రింద ఉన్న పులి ఈసారి నక్కను పలకరించింది.
" నక్కబావా.. నువ్వు మాంసం తిని ఎన్ని రోజులైందో కదా.. నా మాట వింటానంటే ఓ సంగతి చెబుతాను. నువ్వు ధైర్యం తెచ్చుకొని ఆ ఎలుగుబంటిని కిందికి తోసెయ్యి. నేను దాన్ని చంపి తిని, మిగిలిన మాంసాన్ని నీకూ పెడతాను. మీలో ఎవరినో ఒకరిని తినకుండా ఇక్కడినుండి కదలకూడదని నేను ఎలాగూ నిశ్చయించేసుకున్నాను. తెలివైనదానివి, ఆలోచించి నిర్ణయం తీసుకో.. " అంటూ నక్కను ప్రలోభ పెట్టింది.
నక్క కాసేపు ఆలోచనలో పడింది. పెద్దపులి నిర్ణయం ఎంత ధృఢమైందో నక్కకు తెలుసు. తనకు ఆపద తప్పి, ఆహారం దొరుకుతుందన్న ఆశతో ఎలుగుబంటిని అమాంతం కిందికి తోసేసింది.
కిందపడ్డ ఎలుగుబంటి దగ్గరకొచ్చి పులి ఎగతాళిగా నవ్వింది. " చూశావా నక్క తెలివి.. ఎంత చెప్పినా నువ్వు ఆ నక్కను కిందికి తోయ్యలేదు. అది చూడు, నిన్ను ఊరకనే కిందికి తోసేసింది. ఇప్పటికీ మించిపోయిందిలేదు, నేను నిన్ను తినకుండా వదిలేస్తాను. మరి ఇప్పుడయినా చెట్టెక్కి నక్కను క్రిందికి తోసేస్తావా" అంది.
" పులిరాజా.. ఆ నక్క ఎంతో కాలంగా నన్నే నమ్ముకొని బతుకుతోంది. ఈరోజున అదేదో చేసిందని దాని నమ్మకాన్ని నేను వమ్ము చేయను. నిజానికి దానిది మోసపూరితమైన ఒక ఆలోచనే తప్ప, తెలివి కాదు ..మోసం చేసినవాడు తనంతట తానే నష్టపోతాడు.. ఇక నన్ను చంపి నా ఆకలి తీర్చకో" అన్నది ఎలుగుబంటి.
ఆ మాటలకు పెద్దపులి చలించిపోయింది. అంత మంచి మనసున్న దానిని తను ఆ అడవిలో చూడనేలేదు.
" మిత్రమా.. నిన్ను తింటే నాకు మహాపాపం చుట్టుకుంటుంది. నాకు వేరే ఆహారం దొరుకుతుందిలే. నీవు వెళ్లు.." అని బయలుదేరింది పులి. ఎలుగుబంటి కూడా తన దారిన తాను వెళ్ళిపోయింది. నక్క మాత్రం అటు చెట్టు దిగలేక, ఇటు ఆహారమూ లేక అలమటించి, చివరికి క్రిందికి దూకే ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకుంది.
ఈ కథలో నీతి ఏమిటంటే.. "నమ్మిన వారిని ఎప్పుడూ మోసం చేయకూడదు."
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: